Thursday, January 13, 2011
మకర సంక్రాంతి అంటే?
సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి"గా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇకపోతే... "మకరం" అంటే మొసలి. ఇది పట్టుకుంటే వదలదు. అంతేగాకుండా... మన ఆధ్యాత్మిక మార్గానికి ఇది అడుగడుగునా అడ్డు తగులుతూ... మోక్ష మార్గానికి అనర్హులను చేయడంలో మొసలి కీలక పాత్ర వహిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
అందువల్ల ఈ మకర సంక్రమణం పుణ్యదినాలలో మొసలి బారి నుండి తప్పించుకునేందుకు ఒకటే మార్గమని పెద్దలు చెబుతున్నారు. అదేమిటంటే...? వారి వారి శక్తికి తగినట్లు సంక్రాంతి రోజున దానధర్మాలు చేస్తే మొసలి బారినుండి తప్పించుకుని, మోక్షమార్గమును, సుఖసంతోషాలను పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి.
మన భూగోళమందు కర్కాటక రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖలున్నాయని అందరికీ బాగా తెలుసు. సూర్యభగవానుడు సప్తాశ్వాల మీద స్వారీ చేస్తూ... ప్రతినెలా మేషరాశి నుంచి 12 రాశుల మీద ఒక్కొక్క నెల చొప్పున ఉంటూ వస్తాడు. అలా... ఆయా రాశులందు సంక్రమణాలు వస్తూ ఉంటాయి. ఇలా మకరరాశితో సూర్యుడు కలిసినప్పుడు ఆ రేఖతో సంక్రమణం చెంది సూర్యగమనం ఉత్తరదిశగా మారుతుంది. ఈ కాలాన్నే "ఉత్తరాయణ-పుణ్యకాలం" అంటారు.
ఇదేవిధంగా... కర్కాటక రేఖతో కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు సూర్యగమనం దక్షిణ దిశగా ప్రారంభమై "దక్షిణాయణం" వస్తుంది. అందువలనే భీష్మపితామహులు దక్షిణాయనంలో అంపశయ్య మీద పడినా, ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చేంతవరకు నిరీక్షించి తుదిశ్వాస విడిచారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ కారణంగా పితృదేవతల ఆరాధనకు ఉత్తరాయణం పుణ్యకాలంగా వ్యవహరిస్తారు.
Labels:
makara sankaranti,
pongal
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment