Pages

Tuesday, October 12, 2010

ఈ దూరం తరిగేదెప్పుడు?




అలనాటి వలస జీవులకి
టెలిఫోన్లు లేవు, ‘ ఈ మెయిళ్ళు ’ లేవు
ఇంటర్నెట్టు అసలే లేదు
సినిమాలు లేవు, డిష్షుల్లేవు
స్టార్‌ షోల తలపే లేదు


కులపోళ్ళు కలుస్తారనే హామీ లేదు
తోడైనా, నీడైనా, కష్టాల్లో అండైనా
కులపత్ని కాదు దేశీ భామినైనా కాకపోవచ్చు

ఎన్నెన్నో సముద్రాలు దాటి
ప్రపంచానికి అవతలవేపు చేరుకుంటే
కన్నవారినైనా కళ్ళజూసుకునేందుకు లేదు
కన్న దేశానికి తిరిగి వెళ్ళే మాటే రాదు
ఎప్పుడో ఎప్పుడెప్పుడో అందే క్షేమ సమాచారం
ఎప్పుడూ ఇంకెప్పుడూ దాటలేనంత దూరం

గత్యంతరం లేకనైతేనేం?
గత పద్ధతులని మార్చేశారు
గత సాంప్రదాయాల్ని వదిలేశారు
కులభేదాల్ని మరచి పోయారు
కలిసి ఉండటంలోని సుఖాన్ని కనుక్కున్నారు

ఇల్లు కదలడంతో
ఇరుకైన అవకాశాలకే కాదు
ఇరుకైన భావాలకి కూడా
తిలోదకాలిచ్చారు

అయితే అన్ని గతులూ ఉన్న
నేటి ప్రవాసుల మాటేమిటి?
తల్చుకున్నప్పుడల్లా తన వారితో మాట్లాడవచ్చు
మనోవేగంతో ఈమెయిలు కొట్టవచ్చు
బుద్ధి పుట్టినప్పుడు విమానమెక్కితే
మర్నాటికల్లా ముంగిట్లో వాలవచ్చు

ఇల్లు కదిలామని గానీ
ఇంటివారినొదిలామని గానీ
ఎడబాటే అనుభవంలోకి రాదు

అందుకే … అందుకే…
ఇంట్లో ఉన్నప్పటి లాగే
ఎప్పటి ధోరణే కొనసాగిస్తారు
ఎప్పటికప్పుడే గతం పునరుద్ధరింప బడుతూంటే
కొత్త ఆలోచనలకి గానీ, కొత్త ఆచారాలకి గానీ
కొంచెం మనో వికాసానికి గానీ
తావెక్కడ?

పెరిగిపోయిన సాంకేతిక పరిజ్ఞానంతో
ఎదిగిపోయిన శాస్త్ర విజ్ఞానంతో
ఎక్కువౌతున్న దేశీయ వసతులతో
విదేశాన్ని స్వదేశమని భ్రమింపజేయచ్చు

“వెబ్‌” మీద “హిందూ” “ఎక్స్‌ ప్రెస్‌” పత్రికలని చదవచ్చు
ఏం లాభం?
“మాలవాడు రాష్త్రపతి అయ్యాడుట”ని
నోరునొక్కుకునేందుకా?

అడుగడుక్కీ అచ్చమైన ఆంధ్ర భోజనం తినవచ్చు
ఏం లాభం?
“శూద్ర వంటలు నాకు పడవ”ని
ముక్కు మూసుకునేందుకా?

వేలకొలదీ తెలుగు బలగం పెరిగిందని మురవచ్చు
ఏం లాభం?
కులాలు తెగలుగా చీలిపోయి
కలహాలు సాగించేందుకా?
కొత్త తరానికి మన సంస్కృతి విపులంగా వివరించవచ్చు
ఏం లాభం?
చెక్కు చెదరని కులద్వేషాలని
ఆప్యాయంగా అందించేందుకా?

ఆత్మవిమర్శకి అదనివ్వని
ఆత్మజ్ఞానాన్ని పెంపొందించని
విజ్ఞాన సౌకర్యాలవల్ల
ఒరిగిందేమిటి?

అంతరిక్షంలోకి వెళ్ళిన
రోదసీ యాత్రీకులకి
అంత దూరంనించి భూగోళాన్ని చూస్తే
అపురూపమైన ఈ చిన్ని ప్రపంచంలో
అల్పమైన కావేషాలెందుకు?
అర్ధంలేని పోరాటాలనా పి
అందరమూ కలిసి
శాంతి మార్గాన సాగిపోదాం
అనిపించిందట

అమెరికా వెళ్ళిన ఆంధ్రులకి మాత్రం
నేటి హై టెక్‌ సదుపాయాల మధ్య
అర్ధ భూప్రదక్షిణం కూడ
అర కిలోమీటరు దూరంలా అగుపిస్తోంది

అందుకే
ఆస్ట్రోనాటుల దూరదృష్టి బదులు
ఎప్పటి హ్రస్వదృష్టే నిలిచింది
“నాదీ” “నా వారు”ని దాటి
“మనదీ” “మనవార”నగలిగే
దూరం చేరుకోలేదు

దేశాల మధ్య దూరాలని
మాపే ఈ సాధనాలే
మనిషికీ మనిషికీ మధ్య
దూరాన్నెక్కువ చేస్తున్నాయ్‌
దూరం తరిగేదెప్పుడు?

source:eemata.com 

5 comments:

  1. వలస జీవితాల్లో పాత రోజులు కొత్త రోజుల పోలిక చాలా బాగుంది.చాలా రియలిస్టిక్ కవిత లో వర్ణించారు.

    ReplyDelete
  2. మీరు అమెరికా అంధ్రులను బాగా పరిశీలించానరని అనిపిస్తుంది. వాస్తవానికి కవిత చాలా దగ్గరిగా ఉంది. చాలా రోజుల తరువాత మంచి కవిత చదివిన అనుభూతి కలిగింది. ధన్యవాదాలు

    ReplyDelete